కేసీఆర్ భాష సభ్యసమాజం తల దించుకునేలా ఉంది

కేసీఆర్ భాష సభ్యసమాజం తల దించుకునేలా ఉంది

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ విచక్షణ కోల్పోయి కేంద్రమంత్రులను బూతులు తిడుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడిన మాటల్లో తప్పేముందన్నారు. కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి  కిషన్ రెడ్డిపై కేసీఆర్ వాడిన భాష అసభ్యకరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే  స్థాయిలో ఉందన్నారు. సన్నాసుల వంటి పదాలు వాడి తన స్థాయిని తగ్గించుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అర్హులా కాదా? ఒకసారి ఆలోచించుకోవాలన్నారు.

ప్రముఖ రాజకీయ సలహాదారు  ప్రశాంత్ కిషోర్ ని కేసీఆర్ ఇటీవల తరుచుగా కలుస్తున్నారన్నారు.పీకే డైరక్షన్ మేరకే కేసీఆర్ ఆందోళనలు, భౌతికదాడులు చేస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ  భౌతిక దాడులు చేసిన మాదిరే ..తెలంగాణలో కేసీఆర్ నేతలపై భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. మహారాష్ట్రలో రైస్ మిల్లర్లకు క్వింటాల్ కు  రూ.200 బోనస్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా నష్టపోతున్న రైస్ మిల్లర్లకు బోనస్ ఇవ్వాలన్నారు. బహిరంగ చర్చకు  కేంద్రమంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిని రెండు విషయాలు బాధపెడతున్నాయన్నారు. 1)డీలిమిటేషన్ కాకపోవడం. ఇతర పార్టీల నుంచి విచ్చలవిడిగా పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వారికి పదవులు ఇవ్వలేక..  కక్కలేక..మింగలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. 2) మౌనంగా ఉంటే బీజేపీ బలపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అందుకే బీజేపీపై భౌతిక దాడులు చేస్తున్నారన్నారు.  బీజేపీ మతతత్వ పార్టీ అని మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కాళేశ్వరం కట్టి పాలమూరుకు ఎన్ని టీఎంసీల నీళ్లు కొత్తగా ఇచ్చారో కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.