పీడీ యాక్టు ఎత్తివేత.. రాజాసింగ్ విడుదల

పీడీ యాక్టు ఎత్తివేత.. రాజాసింగ్ విడుదల

ఎమ్మెల్యే రాజాసింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదని రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై రాజాసింగ్ బయటకు రానున్నారు.  

పీడీ యాక్ట్ కు బెయిల్ ఉండదు

‘‘ పీడీ యాక్ట్ కు బెయిల్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్ పై పెట్టిన  పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. ఈ రోజే రాజా సింగ్  విడుదల అవుతారు’’ అని బీజేపీ లీగల్ సెల్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఆంటోనీరెడ్డి తెలిపారు. 

రెండు నెలలుగా జైల్లోనే..

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు రెండు నెలలుగా రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు. ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ బీజేపీలోని సెకండ్ క్యాడర్, హిందుత్వ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చివరకు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా వారి ముందు రాజాసింగ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, పలు హిందూ సంఘాలు నిరసనలకు దిగారు. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ప్రజలు, హిందుత్వవాదులు, పార్టీ క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

త్వరలో పార్టీ సస్పెన్షన్ ఎత్తివేత ? 

రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేసే అంశంపై రాబోయే రెండు, మూడు రోజుల్లో బీజేపీ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే రాజాసింగ్ భార్య ఉషాబాయీ బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి దీనిపై చర్చించి వెళ్లారు. ఇక సస్పెన్షన్ పై బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వగా.. దీనికి రాజాసింగ్ ఇది వరకే వివరణ ఇస్తూ లేఖ రాశారు. దీనిపై క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజాసింగ్ వివరణ ఇదీ..

కమెడియన్ మునావర్ ఫారుఖీపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, పైగా హిందూ ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతున్నందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని తనపై తప్పుడు కేసులు బనాయించాయని రాజాసింగ్ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో రాజాసింగ్  పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం రాజాసింగ్ విషయంలో మొదటినుంచీ పూర్తి సానుకూలంగా ఉన్నారు. దీంతో పాటు జైలు నుంచి రాజాసింగ్ ను బయటకు తెచ్చేందుకు న్యాయపరమైన సాయం కూడా అందించారు. రాజాసింగ్​ ను పీడీ యాక్ట్​ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు తమ వంతు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.