కేంద్రాన్ని  బద్నాం చేసే కుట్ర చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు

కేంద్రాన్ని  బద్నాం చేసే కుట్ర చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు

ఫాం హౌస్లో ఉన్న సీఎం కేసీఆర్ను బయటకు గుంజుకొచ్చిన ఘనత బీజేపీదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడం చేతగాని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని  బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తుందని ఉన్నారు. 

వరదల కారణంగా ఇళ్లు, పంట నష్టపోయిన ప్రజలకు పరిహారం ప్రకటించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో కేసీఆర్ సర్కారు ఒక్కసారి కూడా పరిహారం ప్రకటించలేదని మండిపడ్డారు. పంట పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లు ఏం చేశారని గతేడాది హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని అన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి వేల కోట్లు ప్రకటించడం మినహా ఒక్కపైసా విదల్చలేదని విమర్శించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారో చెప్పాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం, ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.