తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా..అసెంబ్లీకి వచ్చింది ముగ్గురే..

తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా..అసెంబ్లీకి వచ్చింది ముగ్గురే..

హైదరాబాద్, వెలుగు: తొలిరోజు  అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురే అటెండ్ అయ్యారు. ఆ పార్టీ ఎల్‌‌పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, ధన్‌‌పాల్ సూర్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. రాజాసింగ్ మినహా ఏడుగురు ఎమ్మెల్యేలున్న పార్టీలో.. తొలిరోజే మెజారిటీ సభ్యులు హాజరుకాలేదు. గట్టిగా కొట్లాడాలని నిర్ణయించిన మరుసటిరోజు ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంపై అటు పార్టీలో.. ఇటు అసెంబ్లీ లాబీల్లో గుసగుసలు వినిపించాయి. సభకు రాని ఎమ్మెల్యేలు ఎటు వెళ్లారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. 

అయితే, పలువురు ఎమ్మెల్యేలు తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లినట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని గొప్పగా చెప్పుకున్న నేతలు.. సభలో మైక్ పట్టుకోవాల్సిన టైంలో రాకుండా పోయారని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో బీజేఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో అందరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ, తెల్లారేసరికి సీన్ రివర్స్ అయింది.