హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆరోపించారు. మేనేజ్మెంట్లు బకాయిలు అడిగితే.. విజిలెన్స్ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిర్వహిస్తున్న నిరవధిక బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయక ఇబ్బంది పెట్టిందని, అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేండ్లుగా ఫీజు బకాయిలను విడుదల చేయడం లేదని తెలిపారు. బకాయిలపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.1200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సర్కార్ ఈ బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులకు మద్దతుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.
