పదేండ్లు అధికారంలో ఉండి..కేసీఆర్ 10 మీటర్ల టన్నెల్ తవ్వలేదు: సీఎం రేవంత్ రెడ్డి

పదేండ్లు అధికారంలో ఉండి..కేసీఆర్ 10 మీటర్ల టన్నెల్ తవ్వలేదు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి కావాలనే ఎస్ఎల్ బీసీని పూర్తి చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  పదేండ్లలో కనీసం 10 మీటర్ల టన్నెల్ కూడా తవ్వలేదని ఫైర్ అయ్యారు. నవంబర్ 3న ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పరిశీలించిన సీఎం రేవంత్.. ఎస్ఎల్ బీసీ ని పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పదేండ్లలో కేసీఆర్..ఏ పెండింగ్ ప్రాజెక్టును  పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ టన్నెల్ ఎపుడో పూర్తయ్యేదన్నారు రేవంత్. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే తాము అధికారంలో  ఉండి ప్రయోజనం లేదన్నారు రేవంత్.. ఈ ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆదుకుంటామని.. డిసెంబర్ 9 లోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రేవంత్ .

మీడియాతో మాట్లాడిన రేవంత్... ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి ఎస్ఎల్ బీసీని మంజూరు చేయించుకున్నాం. ఆనాడు ఎస్ఎల్ బీసీ టన్నెల్ విలువ 2 వేల కోట్లు. 1983లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ మంజూరైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు..ఎస్ఎల్ బీసీని గత ప్రభుత్వం గాలికొదిలేసింది. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని పూర్తి చేయలేదు.  రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ వ్యవహరించింది. గ్రావిటీ ద్వారా 4 వేల క్యూసెక్కులు ఎస్ఎల్ బీసీ ద్వారా తీసుకెళ్లొచ్చు.42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచలో ఎక్కడా లేదు’.

Also Read : ఈ పిల్లలకు ఇక అమ్మానాన్న లేరు.. పాపం ఈ అక్కాచెల్లెళ్లు

‘ ప్రాజెక్టు పూర్తైతే 30 టీఎంసీలు నల్గొండకు ఖర్చు లేకుండా తీసుకెళ్లొచ్చు.  నల్గొండ జిల్లాకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు.  రూ. లక్షా 86 వేల కోట్లు సాగునీటి కాంట్రాక్టర్లకు కేసీఆర్ చెల్లించారు.  కృష్ణానదిపై చేపట్టిన ఏ ప్రాజెక్టు కేసీఆర్ పూర్తి చేయలేదు. కృష్ణాలో 299 టీఎంసీలు  చాలని కేసీఆర్ సంతకం పెట్టొచ్చాడు.  మన అన్ని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. కేసీఆర్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే ఈ దుస్థితి.  దేశంలో ఇంత తక్కువ ఖర్చుతో 30టీఎంసీలు తీసుకెళ్లే ప్రాజెక్టు ఏదీ లేదు.  కమీషన్లు  రావనే ఆనాడు ఎస్ఎల్ బీసీని కేసీఆర్ పూర్తి చేయలేదు. హరీశ్ రావు  చిల్లర మాటలు మానేయాలి’ అని రేవంత్ ధ్వజమెత్తారు.