వాషింగ్టన్: 33 ఏండ్ల తర్వాత తన అమ్ములపొదిలోని అణ్వాస్త్రాలను పరీక్షించాలని అగ్రరాజ్యం అమెరికా డిసైడ్ అయ్యింది. ఈ మేరకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికన్ దళాలు అణు పరీక్షలకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల రష్యా విజయవంతంగా అణ్వాస్త్ర పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. రష్యా అణ్వాయుధ పరీక్షలు చేసిన కొన్ని రోజుల్లోనే అమెరికా కూడా న్యూక్లియర్ టెస్ట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అసలేం జరగబోతుందని ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు ట్రంప్. ఇతర అణ్వాయుధ దేశాలు చేసినట్లుగానే మేము కూడా మా అణ్వాయుధాలను పరీక్షించబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలు దూకుడు చూపిస్తుండటంతో అమెరికా కూడా తన సొంత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్, చైనాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉత్తర కొరియా, రష్యా కూడా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయని ఆరోపించారు. ఇతర దేశాలు అణ్వాస్త్ర పరీక్షలు చేస్తున్నప్పుడు ఒక్క అమెరికా మాత్రమే ఎందుకు న్యూక్లియర్ టెస్టులు చేపట్టొద్దని ప్రశ్నించారు. రష్యా, చైనా దేశాలు అణు పరీక్షలు చేస్తున్నా వాటి గురించి ఎవరు మాట్లాడరని.. కానీ మాదంతా బహిర్గతమే.. మేము బహిరంగంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు.
మేం చెప్పపకపోయిన మీరు రిపోర్టింగ్ చేస్తారని.. కానీ ఇలా రాసే రిపోర్టర్లు చైనా, రష్యాదగ్గర లేరని జర్నలిస్టులను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయడానికి కావాల్సినన్నీ అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. రష్యా, చైనా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి.. కానీ మా దగ్గర వాళ్ల కంటే ఎక్కువ ఉన్నాయన్నారు. అణ్వస్త్ర నిరాయుధీకరణ చాలా గొప్ప విషయమని.. కానీ ఇతర దేశాల తీరు వల్ల మూడు దశాబ్దాలకు తర్వాత అమెరికా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడం సముచితమేనని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు ట్రంప్.
