World Cup 2025 Final: టీమిండియా పేసర్లకు భారీ నగదు.. రేణుక, క్రాంతి గౌడ్‌కు రూ.కోటి నజరానా

World Cup 2025 Final: టీమిండియా పేసర్లకు భారీ నగదు.. రేణుక, క్రాంతి గౌడ్‌కు రూ.కోటి నజరానా

సౌతాఫ్రికాపై విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకున్న టీమిండియా తమ కలను సాకారం చేసుకుంది. వరల్డ్ కప్ జట్టులో భాగమైన టీమిండియా ఫాస్ట్ బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్ లకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానా ప్రకటించాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సోమవారం (నవంబర్ 3) సిమ్లా జిల్లాకు చెందిన మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేత రేణుకా సింగ్ ఠాకూర్ కు కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. వరల్డ్ కప్ ఫైనల్లో రేణుక పొదుపుగా బౌలింగ్ చేసింది. వికెట్ తీయకున్నా 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చింది.      

ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రేణుకతో ఎనిమిది నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి మ్యాచ్ మొత్తం చూశానని ఆయన తెలిపారు. "హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తరపున మీకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. మీరు వివిధ క్రికెట్ సంఘాల నుండి అనేక గౌరవాలను అందుకుంటారు. కానీ ఈ బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది". అని ఆయన అన్నారు.

భారత మహిళా క్రికెట్ ఫాస్ట్ బౌలర్  క్రాంతి గౌడ్‌కు సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.  
ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఛతర్‌పూర్ స్టార్ బౌలర్ క్రాంతి గౌడ్‌కు రూ. కోటి రూపాయలను ప్రకటించారు. వరల్డ్ కప్ లో క్రాంతి అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఇండియా తొలి వరల్డ్ కప్ గెలవడంతో ఆమె చేసిన కృషికి ఈ నగదు దక్కింది. "మధ్యప్రదేశ్ కుమార్తె దేశానికి గౌరవం తెచ్చిపెట్టడమే కాకుండా లక్షలాది మంది బాలికలకు స్ఫూర్తి దీపాన్ని వెలిగించింది" అని ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో క్రాంతిని హృదయపూర్వకంగా అభినందించారు. ఫైనల్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన క్రాంతి కౌడ్ 16 పరుగులు ఇచ్చింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని  డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఇండియా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.