కాపురం చేయలేనని రెండు సార్లు వెళ్లిపోయిన భార్య.. మూడోసారి వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్లింది.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

కాపురం చేయలేనని రెండు సార్లు వెళ్లిపోయిన భార్య.. మూడోసారి వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్లింది.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

పెళ్లై మూడేళ్లు గడిచింది. రెండేళ్లకే మనస్పర్ధలు వచ్చాయి. భార్య తల్లిగారింటికి వెళ్లింది.. భర్త విడాకులకు అప్లై చేశాడు.. విడాకులు మంజూరయ్యాక భార్య మళ్లీ కాపురానికి వచ్చింది.. మళ్లీ వెళ్లిపోయింది.. కానీ ఈ సారిమాత్రం ప్రాణం తీసుకుని వెళ్లిపోయింది. సోమవారం (నవంబర్ 03) జరిగిన భార్యభర్తల గొడవలో భర్త తల్లి చనిపోవడం విషాదంగా మిగిలింది. ట్విస్టుల మీద ట్విస్టులున్న ఈ క్రైమ్ స్టోరీ ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ (30) అదే గ్రామానికి చెందిన మోటపోతుల అఖిల కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన రెండేళ్ల తరువాత భార్య భర్తలకు మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి అఖిల తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. 

ఈ క్రమంలో ఏడాది కాలంగా భార్య రాకపోవడంతో భర్త మహేష్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు. పలుమార్లు నోటీసులు పంపినా అఖిల కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. విషయం తెలుసుకున్న అఖిల తల్లిదండ్రులు ముత్తగూడెం గ్రామ పెద్దల సహకారంతో భార్యాభర్తలను ఇద్దరినీ ఒక్కటి చేశారు. కొద్ది రోజులు భర్త దగ్గర ఉన్న అఖిల మళ్ళీ తల్లిగారింటికి వెళ్ళింది. 

అఖిల తండ్రి వెంకన్న,  సోదరుడు మనోజ్, మనోజ్ బావమరిది యల్ది వెంకన్న లు అఖిలకు సర్ది చెప్పి  మహేష్ ఇంటికి తీసుకువచ్చారు. అఖిలను ఇంట్లోకి తీసుకెళ్లి భార్యగా స్వీకరించాలని మహేష్ ను కోరగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రీకులైన అఖిల తండ్రి మోటపోతున వెంకన్న.. నాబిడ్డను రానివ్వకుండా నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా.. అని అఖిలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. 

Also Read : చేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి

అనంతరం వెంకన్న కొడుకు మనోజ్ తో పాటు అతని బావమరిది యల్ది వెంకన్నను తీసుకొని వచ్చి మహేష్ ఇంటిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో మహేష్ శరీరంపై కత్తి పోట్లు పడగా.. అడ్డొచ్చిన మహేష్ తల్లి నాగమణి (50)ని సైతం కత్తులతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన మహేష్ ను ఖమ్మం సిటీ లోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులు ముగ్గురు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూరల్ ఏసీపి తిరుపతిరెడ్డి, ఎస్ హెచ్ వో సీఐ ఎం. రాజు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.