హామీలు నెరవేర్చే దాకా సర్కార్ ను వదిలేది లేదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హామీలు నెరవేర్చే దాకా సర్కార్ ను వదిలేది లేదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  • కాంగ్రెస్ అసమర్థ పాలనను నిరసిస్తూ 23న చలో అసెంబ్లీ: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 23న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్ తో కలిసి మల్క కొమరయ్య చలో అసెంబ్లీ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. 

పరిపాలనలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, విద్యారంగానికి మొండిచేయి చూపించిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విద్య కోసం 14 శాతం నిధులు కేటాయిస్తుంటే.. ఇక్కడ కేవలం 8 శాతంతోనే సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పైసలు ఖర్చు చేసే స్థితిలో లేదని, కేంద్రం పంపే నిధులతోనే పనులు కానిచ్చేస్తోందని కొమరయ్య ఎద్దేవా చేశారు.