యూపీలోని కార్తీక రాస్ మహోత్సవంలో నాట్యం చేసిన హేమామాలిని

యూపీలోని కార్తీక రాస్ మహోత్సవంలో నాట్యం చేసిన హేమామాలిని

యూపీలోని మధురలో జరిగిన కార్తీక రాస్ మహోత్సవంలో బీజేపీ ఎంపీ, నటి హేమామాలిని పాల్గొన్నారు. జవహర్ బాగ్ లోని బ్రజ్ రాజ్ ఉత్సవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాస్ మహోత్సవం కార్యక్రమంలో హేమామాలిని రాధ పాత్రలో నాట్యం చేశారు. సుమారు గంట సేపు వేదికపైనే నాట్యం చేశారు. నాట్యం ప్రారంభం నుంచి చివరి వరకూ ఆమెలోని ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. తాను నాట్యం చేస్తున్నంత సేపు అక్కడున్న వారంతా మైమరచిపోయి చూస్తూ ఉండిపోయారు. 

ఒకప్పుడు డ్రీమ్ గర్ల్‭గా బాలీవుడ్‭ను ఏలిన అందాల రాశి హేమామాలిని పై నేటికీ అభిమానుల అభిమానం ఇంచు కూడా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. ఉత్తమ నటిగా నేటికీ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. క్లాసికల్ డ్యాన్స్ అంటే ప్రాణం పెట్టే హేమమాలిని దేశవిదేశాల్లో ఇచ్చిన ప్రదర్శనలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తరచూ తన కుమార్తెలతో కలిసి భరతనాట్య ప్రదర్శనలు చేసే హేమ.. కార్తీక రాస్ మహోత్సవంలో తన నాట్యంతో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. 74 ఏళ్ళు నిండినా, ఇప్పటికీ ఎంతో చెలాకీగా ఆమె నాట్యం చేస్తున్నారు.