రామ మందిరం కట్టాలనేది కరసేవకుల కల

రామ మందిరం కట్టాలనేది కరసేవకుల కల

నేరేడ్‌‌మెట్: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమానికి స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ హాజరయ్యారు. నేరెడ్మెట్ డివిజన్‌‌లో స్థానిక టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు ఈ ప్రోగ్రామ్‌‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. మల్కాజిగిరిలోని వివిధ ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిధి సమర్పణ కోసం కృషి చేశారు. ఈ నిధి సమర్పణలో 32 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. నిధి సమర్పణలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకున్న వారికి బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు. రామ మందిర నిర్మాణం జరగాలన్న కరసేవకుల కల నెరవేరుతోందన్నారు. ‘పార్టీలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిధి సేకరణ సమయం ముగుస్తున్నా ఎందరో ముందుకు రావడం సంతోషకరం. మందిర నిర్మాణానికి నిధిని అందించిన వారే హిందువులు కాదు. నిర్మాణం జరగాలని కోరుకునే వారందరూ హిందువులే’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.