
మైహోం మైన్స్ కంపెనీ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ విషయంపై విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఎంపీ అరవింద్ ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మైహోం అక్రమ మైనింగ్ గురించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మూడుసార్లు నోటీసులు పంపించినా స్పందించడం లేదు. ఆ నోటీసులను రాష్ట్ర మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పక్కకు పెట్టాడు. కోర్టుల నుంచి మైనింగ్ మినిస్టర్ కేటీఆర్‌ను జయేష్ రంజన్ ఎన్నిరోజులు కాపాడుతాడో చూడాలి. జయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పటం లేదు. మైహోం మైనింగ్ కంపెనీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మైనింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. మైనింగ్ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియా లేదని రాష్ట్ర అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్రం సూచించింది. నేను ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం లేదు. ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన విషయాలే నేను చెబుతున్నా. ఎక్స్పర్ట్ కమిటీ ఎన్నిసార్లు చెప్పినా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం మైహోం మైనింగ్ పై చర్యలు తీసుకోవడం లేదు.
మైహోం కంపెనీ పర్యావరణ అనుమతులు లేకుండా నల్గొండలో 2001 నుంచి మైనింగ్ చేస్తుంది. ఒకరు అనుమతులు తీసుకున్న మైనింగ్‌ను మరొకరు చేస్తే సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. మైనింగ్ యాక్ట్ వల్ల దేశానికి లక్ష కోట్ల లాభం చేకూరింది.
కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే జయేష్ రంజన్ మైహోం సంస్థకు దొంగ దారిలో అనుమతులిచ్చారు. 2016లో కేసీఆర్, చంద్రబాబు సహకారంతో మైహోం సంస్థ అనుమతులు ట్రాన్సఫర్ చేసుకుంది. ప్రస్తుత జగన్ సర్కార్ సైతం జై జ్యోతి సంస్థకు అనుమతులివ్వటం అనైతికం. మై హోం సంస్థకు గుంటూరులో వెయ్యి ఎకరాల అక్రమ మైనింగులున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో మైహోం సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోంది. ఆంధ్రలో ఐఏఎస్ అధికారులకు రూల్స్ తెలియవా? జగన్మోహన్ రెడ్డి యువముఖ్యమంత్రి. దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా గెలుపు సాధించారు. రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరించాలి. క్రిమినల్స్‌ను కాపాడవద్దని ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడిగా.. జగన్ ప్రజల సొమ్మును రికవరీ చేయాలి. మైహోం సంస్థ నుంచి వేల కోట్లు పెనాల్టీలు వసూలు చేసి భరతమాత రుణం తీర్చుకోవాలి. ఐఏఎస్‌లు శోభా, జయేష్ రంజన్‌లు చిత్తశుద్ధి కలిగిన అధికారులైతే.. మైహోం సంస్థ కేసును సీబీఐకు అప్పగించాలి. అక్టోబర్ 15లోపల కేసును సీబీఐకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెలంగాణలో మైహోం సంస్థకు అమ్ముడుపోయిన ప్రభుత్వం నడుస్తోంది.
మైహోం రామేశ్వర్ రావు మే నెలలో మా ఇంటికొచ్చి మా నాన్నను కలిశాడు. నన్నువదిలేయాలని, నా జోలికి రావొద్దని రామేశ్వర రావు రిక్వెస్ట్ చేశాడు. తండ్రి లాంటి వాడినని చెప్పినంత మాత్రాన రామేశ్వరంకు లొంగుతానా? సిద్దాంతం కోసం నా తండ్రి మాటను సైతం లెక్కచేయను. రామేశ్వరం నుంచి కనీసం వెయ్యి కోట్ల నష్టపరిహారం కట్టిస్తాను. రామేశ్వరంతో మాకు 35 ఏళ్ళ పరిచయం ఉన్న మాట వాస్తవం. రామేశ్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. నా తండ్రి రాజకీయలతో నాకు సంబంధం లేదు. బురద లాంటి కాంగ్రెస్ నుంచి మా నాన్న.. పెండ లాంటి టీఆర్ఎస్‌లో పడ్డారు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
For More News..