- ఉత్కంఠ పోరులో బీజేపీ మద్దతు అభ్యర్థి సతీశ్ గెలుపు
కమలాపూర్, వెలుగు: తొలి విడత పంచాయతీ పోలింగ్ లో హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి కమలాపూర్ మండలంలోని పలు మేజర్ పంచాయతీ స్థానాల కౌంటింగ్ గురువారం అర్ధరాత్రి వరకు జరిగింది. కమలాపూర్ మేజర్ పంచాయతీ కౌంటింగ్ రాత్రి 12 గంటల వరకు ఉత్కంఠగా కొనసాగగా.. చివరకు బీజేపీ అభ్యర్థి పబ్బు సతీశ్ గౌడ్ గెలుపొందారు.
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సొంతూరు కావడంతో కమలాపూర్ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి జర్నలిస్ట్ పబ్బు సతీశ్ గౌడ్, బీఆర్ఎస్అభ్యర్థి బైరి దశరథం మధ్య హోరాహోరీగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కమలాపూర్ పై ఫోకస్ పెట్టారు. ఇక్కడి ఫలితంపై అర్ధరాత్రి వరకు సస్పెన్స్ నడిచింది.
పంచాయతీలో 9,754 ఓటర్లు ఉండగా.. 7,779 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి సతీశ్ గౌడ్ 4,792 ఓట్లు సాధించి 2,150 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి దశరథం(2,642)పై విజయం సాధించారు. మండలంలోని ఉప్పల్, వంగపల్లి, శనిగరం జీపీల్లో కూడా కౌంటింగ్ ఆలస్యమైంది. కాగా ఉప్పల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మొండెద్దుల రమ, శనిగరంలో బీజేపీ అభ్యర్థి కొత్తపెల్లి రాజు, వంగపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి నకీర్త్ రాజు గెలుపొందారు.

