టీఆర్ఎస్ ముఖ్యనేతలు టచ్​లో ఉన్నరు: లక్ష్మణ్

టీఆర్ఎస్ ముఖ్యనేతలు టచ్​లో ఉన్నరు: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్ తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్​లో ఉన్నారని, త్వరలో మరో మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరనున్నారని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత చిట్ చాట్ చేశారు. కేసీఆర్ మోసగాడనే ముద్ర పడిపోయిందని, ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఆయన నిజ స్వరూపాన్ని గుర్తించారన్నారు. టీఆర్ఎస్.. కాంగ్రెస్​లది డూప్ ఫైట్ అని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది మూసీ మురికిలో పడ్డట్లేనన్నారు. మునుగోడు బైపోల్ ఫలితం.. టీఆర్ఎస్ సర్కార్ పతనానికి నాంది కానుందన్నారు.  టీఆర్​ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతోందని విమర్శించారు.

మీ అభ్యర్థి పనిచేయలేని దద్దమ్మనా

ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో కేసీఆర్​ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని లక్ష్మణ్ అన్నారు. మీ అభ్యర్థి గెలిచినా పని చేయలేని దద్దమ్మనా.. అందుకే కేటీఆర్ దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం వచ్చిందని, చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వంపై తీసుకువచ్చిన ఒత్తిడి వల్లనే గొల్ల,- కురుమలకు నగదు బదిలీ జరిగిందన్నారు. 

లక్ష్మణ్ తో బూర నర్సయ్య గౌడ్​ భేటీ

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో సోమవారం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ లోని లక్ష్మణ్ నివాసానికి వెళ్లిన బూర.. ఆయనతో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారు.