
న్యూఢిల్లీ, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శనివారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జెండాపై జరగని ఎన్నికలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చినా.. తమకు ప్రయోజనం కలగలేదన్నారు. 2028 ఎన్నికల్లో ఈ అంశంతో ప్రజల్లోకి వెళ్తామా లేదా అనేది ఇప్పట్లో చెప్పేదికాదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీసీకి సీఎం పదవి అనేదానిపై మాట్లాడాల్సి ఉంటుందన్నారు.
రిజర్వేషన్లపై కవిత కొత్త డ్రామా
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించి అన్యాయం చేసిందని, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత రిజర్వేషన్లపై కొత్త డ్రామాకు తెరలేపారని లక్ష్మణ్ విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం మంత్రవర్గం తీర్మానం చేయడం బీసీలను వంచించడమేనని ఫైర్ అయ్యారు. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానం బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబేంటో సీఎం రేవంతే చెప్పాలని అన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు గవర్నర్ ఆమోదిస్తారా? ఆమోదించినా కోర్టుల్లో నిలబడుతుందా అని ప్రశ్నించారు.
బీసీల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ పేర్కొన్న గణాంకాలు బయటపెట్టకపోవడాన్ని లక్ష్మణ్ తప్పుబట్టారు. ఎంత మంది బీసీలు ఉన్నారనేది ముఖ్యం కాదని, బీసీ కులాల్లో ఎంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కిందో చెప్పాలన్నారు. డెడికేటెడ్ కమిషన్ వివరాలను దాచిపెట్టడం అంటే బీసీలను మోసం చేసినట్లేనని అన్నారు.
రోహిత్ వేముల మృతికి రాంచందర్‌రావు కారణమనే ఆరోపణలు ఉత్తవేనని కొట్టిపారేశారు. ఈ విషయంలో ఆయనకు సంబంధంలేదని కోర్టులు కూడా తీర్పునిచ్చాయని గుర్తుచేశారు. రాజాసింగ్ స్వయంగా రాజీనామా చేశారు కాబట్టి అధిష్టానం ఆమోదించిందని చెప్పారు.