బీఆర్ఎస్, ఎంఐఎం.. కాంగ్రెస్​కు తోక పార్టీలు : ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్, ఎంఐఎం.. కాంగ్రెస్​కు తోక పార్టీలు : ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్​లో కాంగ్రెస్​కు ఎంఐఎం, బీఆర్ఎస్ తోక పార్టీలుగా వ్యవహరించాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగానే.. బీఆర్ఎస్, ఎంఐఎం కూడా సభ నుంచి వెళ్లిపోయాయన్నారు. ఇండియా కూటమి ఒక దోపిడీ ముఠా అని విమర్శించారు. శుక్రవారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత.. పార్లమెంట్ ఆవరణలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బయటపడ్డదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదా? ఇదే విషయాన్ని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసిన గృహాలను ఇప్పటిదాకా నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలకు బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బండి సంజయ్ సభలో ప్రసంగించారని చెప్పారు. ఇండియా కూటమి సభ సజావుగా సాగకుండా సమయాన్ని వృథా చేసిందన్నారు. ‘ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు.. మోదీ మాట్లాడుతుంటే ఎందుకు పారిపోయారు. అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికి’ అని లక్ష్మణ్​ ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ నుంచి పారిపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. మోదీ అభివృద్ధిని అడ్డుకోవడమే కూటమి పార్టీల లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు కుల, మతతత్వాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. 

తమదే చరిత్ర అన్నట్లు చెప్పుకుంటున్రు..

దేశంలో నెహ్రూ కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలదే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్​ ఫైర్​ అయ్యారు. మజ్లిస్ ఒత్తిడితో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్ర మరుగున పడేలా చేశారని విమర్శించారు. గురువారం ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్​లో తూళ్ల వీరేందర్ గౌడ్ నిర్వహించిన దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్ధంతి సభలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బత్తిని మొగులయ్య పోరాడారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే మరుగునపడిన యోధుల త్యాగాలను స్మరించుకునేలా విగ్రహాలు పెడుతామన్నారు.