రేవంత్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

రేవంత్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు : జమిలి ఎన్నికలంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాలనా విధానాలను, సంక్షేమాన్ని తట్టుకోలేక, ఆయన చరిష్మాను జీర్ణించుకోలేక కాంగ్రెస్ జమిలిపై విషప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘దేశంలో1952, 1957, 1962, 1967లో నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. అప్పుడెందుకు వాటిని కాంగ్రెస్ సమర్థించింది. ఆనాడు కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడానికే జమిలి ఎన్నికలు నిర్వహించారా..?’ అని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ ఆనాడు లేని ప్రస్తావనను కాంగ్రెస్ ఇప్పుడెందుకు తెస్తోందని నిలదీశారు. ‘సమయం, డబ్బులు వృథా కాకుండా ప్రజల కోసం మోదీ జమిలి ఆలోచన చేస్తే.. కాంగ్రెస్ కు అంత భయం దేనికి? వేలాది కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖర్చు అవసరమా?’ అని ప్రశ్నించారు. 

జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీలో ప్రతిపక్ష నాయకుడిగా అధిర్ రంజన్ కు అవకాశం కల్పిస్తే.. కాంగ్రెస్ ఎందుకు పారిపోతోందని నిలదీశారు.  గతంలో బీఆర్ఎస్ ఎంపీలు సైతం  జమిలి ఎన్నికలు దేశానికి మంచివని మెచ్చుకున్నారని, ఇప్పుడు వాళ్లు కూడా మాట మారుస్తున్నారన్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఊహకు అందని విధంగా అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉండబోతున్నాయన్నారు. దేశం కోసం చర్చ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.

ఉదయనిధి వెంటనే క్షమాపణ చెప్పాలె

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కొడుకు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేషపూరితంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. అతని వ్యాఖ్యలు యావత్ హిందువులను అవమానపర్చాయన్నారు. తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నంలోనే ఆలయం ముద్ర ఉంటుందని, మీకు దమ్ముంటే ఆ చిహ్నాన్ని తీసేయాలని స్టాలిన్ ప్రభుత్వానికి లక్ష్మణ్​ సవాల్ విసిరారు. సనాతన ధర్మంపై విషం కక్కిన ఉదయనిధి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. జిమిలిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న రేవంత్.. ఉదయనిధి కామెంట్లను ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలని, రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.