గ్యారంటీల పేరుతో మోసం..కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ రెండూ తోడు దొంగలే: లక్ష్మణ్

గ్యారంటీల పేరుతో మోసం..కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ రెండూ తోడు దొంగలే: లక్ష్మణ్
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తలే: ఎంపీ లక్ష్మణ్
  • కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ రెండూ తోడు దొంగలే

న్యూఢిల్లీ, వెలుగు:  దేశవ్యాప్తంగా తుక్కు అయిన కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన సభలోనూ తుస్సుమన్నదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాబోమని తెలిసే.. అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చిందని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ గ్యారంటీలు.. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరే ఉన్నాయి. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ఆదాయ వనరులు ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఉచితాలు పంచుతారో స్పష్టత ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నేతలు.. అమరుల బలిదానాలను, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మాట ఇచ్చి తప్పడం వల్లే 1,200 మంది యువకులు ఆత్మబలినాలు చేసుకున్నారు. ఆ యువకుల మరణానికి కారణం సోనియా గాంధీయే. అందుకు కాంగ్రెస్ నేతలు తెలంగాణ అమరుల కుటుంబాలకు, ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి” అని డిమాండ్ చేశారు.

మద్యం ఆదాయాన్ని లక్ష కోట్లకు పెంచుతారా?

ఒకప్పుడు రూ.6 వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయాన్ని ప్రస్తుతం రూ.40 వేల కోట్లకు చేర్చారని లక్ష్మణ్ విమర్శించారు. మరి కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీల కోసం మద్యం ఆదాయాన్ని లక్ష కోట్లకు పెంచుకుంటారా? అని ప్రశ్నించారు. అలాగే జాగా ఉంటే ఇండ్లు కట్టుకునేందుకు తొలుత రూ.5 లక్షలు ఇస్తానన్న కేసీఆర్.. తర్వాత రూ.3 లక్షలు, రూ.2 లక్షలు అంటూ 10–15 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్.. అసలు ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ రెండూ తోడుదొంగలేనని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే నైతిక హక్కు ఎంఐఎం, కాంగ్రెస్​కు లేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే దేశంలో తెలంగాణ విలీనమైందని చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కులం, మతం పేరు మీద సమాజాన్ని వేరు చేయలనే కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మంపై రెచ్చగొట్టడం, ఉచితాల ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ గ్యారంటీలు.. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరే ఉన్నాయి. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలి. ఆదాయవనరులు ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఉచితాలు పంచుతారో స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ ఏర్పాటుపై మాట ఇచ్చి తప్పడం వల్లే నిరాశతో 1,200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆ యువకుల మరణానికి కారణం సోనియా గాంధీయే. 
- బీజేపీ ఎంపీ లక్ష్మణ్