యూపీ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు

యూపీ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు

హైదరాబాద్: సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్ పై మండిపడ్డారు. గురువారం అంబర్ పేటలో జరిగిన బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ యూపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ లక్ష్మణ్...అక్కడి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. యూపీలోని పేదల కోసం సీఎం యోగి చాలా శ్రమిస్తున్నారన్న లక్ష్మణ్ ... యోగి ప్రవేశ పెడుతున్న అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని కొనియాడారు. రూ.36 లక్షల కోట్లతో 86 లక్షల మంది రైతులకు యోగి మేలు చేశారని చెప్పారు.

గడిచిన ఐదేళ్లలో 5 లక్షల మందికి సీఎం యోగి ఉద్యోగాలు కల్పించారని, 50 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇచ్చారని తెలిపారు. మరీ రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని సవాలు విసిరారు. రైతు రుణమాఫీ అమలు చేయడం లేదని, దీంతో  అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి  బీజేపీకి పట్టం కట్టాలని కోరారు.