బీఆర్​ఎస్​ నేతలు కాళ్ల బేరానికి వచ్చినా వాళ్లతో పొత్తు ఉండదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

బీఆర్​ఎస్​ నేతలు కాళ్ల బేరానికి వచ్చినా వాళ్లతో పొత్తు ఉండదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
  • రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు ఒంటరిగానే పోటీ చేస్తం
  • బీఆర్​ఎస్​ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నరు
  • మాతో అందరూ టచ్లో ఉన్నరు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపార్టీ బతికి బట్ట కట్టే స్థితిలో లేదని బీజేపి పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన పడవ అని, అది చచ్చిన పామని, దాని గురించి చర్చే అవసరం లేదని పేర్కొన్నారు.  ‘‘బీఆర్​ఎస్​ నేతలు ఎన్ని రకాలుగా కాళ్ల బేరానికి వచ్చినా.. ఆ పార్టీతో మాకు పొత్తు ప్రసక్తే ఉండదు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ హోదాలో ఈ విషయాన్ని చెప్తున్న” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు బీజేపీ సొంతగానే బరిలో దిగుతుందని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నూటికి 90 శాతం మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నరు. ఒక్క బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగా లేరు.

మాతో అందరూ టచ్ లో ఉన్నరు” అని తెలిపారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయా? అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​తో కలిసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడిందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ రాద్దాంతం చేస్తున్నదని, ప్రాజెక్ట్ లో అవినీతిని బూచీగా చూపి బీఆర్ఎస్ ను లొంగదీసుకుంటున్నదని ఆరోపించారు.

అదేవిధంగా కృష్ణా నది జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్​ఎస్​ నేతలు బొక్కింది అంతా కక్కిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాళ్లతోనే పడుతున్నట్లుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్    మధ్య రహస్య ఒప్పందం ఉందని, దీన్ని తాము బస్సు యాత్రల్లో తేటతెల్లం చేస్తామని లక్ష్మణ్​ అన్నారు.  ఎమ్మెల్సీ కవితపై విచారణ జరుగుతున్నదని, ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయని చెప్పారు. 

ఎంపీ ఎన్నికలు మహా భారత యుద్దంలాంటిది 

రానున్న లోక్ సభ ఎన్నికలు మహాభారత యుద్ధం వంటిదని, కౌరవ సైన్యం మాదిరిగా ప్రతిపక్షాలు కలిసి యుద్ధానికి వస్తున్నాయని లక్ష్మణ్  అన్నారు.  కుల, కుటుంబ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఏకమయ్యాయని, మోదీని ఓడించాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్షాలకు మరో అజెండా లేదని దుయ్యబట్టారు.

దేశం కోసం మోదీ పనిచేస్తుంటే, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం, అవినీతి అక్రమాలతో దోచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర కన్నా ముందు 'కాంగ్రెస్ జోడో' యాత్రను రాహుల్​ చేయాలని విమర్శించారు. మూడు తరాల నుంచి కాంగ్రెస్ తో ఉన్న సీనియర్ నేతలు ఆపార్టీని వీడుతున్న విషయం తెలుసుకోవాలన్నారు.