
మోడీ, అమిత్ షా, యోగీ ఫొటోలపై క్రాస్ మార్క్
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు విష రసాయనాలతో కూడిన లెటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పంపించారు. సాధ్వీ ఇంటికి ఒక ఎనెవలెప్ కవర్ పోస్టు ద్వారా వచ్చింది. దానిని ఆమె సెక్రటరీ తీసి చూడగా.. అందులో కొన్ని వార్నింగ్ లెటర్స్‌తో పాటూ ఏదో పౌడర్ కూడా ఉంది. దాన్ని పట్టుకున్నసాధ్వీ సెక్రటరీ.. దురదకు గురయ్యాడు. సెక్రటరీ ఈ విషయాన్ని వెంటనే సాద్వీకి తెలియజేయడంతో, ఆమె భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇర్షాద్ వాలి తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఆ కవరును పరిశీలించిన తర్వాతే పౌడర్‌లో ఏముందో స్పష్టమవుతుందని ఆయన అన్నారు.
తనకు గతంలో కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చాయని సాధ్వీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇప్పుడు పంపిన లెటర్‌లో ఏదో విషపూరిత పౌడర్ ఉందని ఆమె తెలిపారు. అంతేకాకుండా లెటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిష్టర్ అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, కశ్మీర్ గవర్నర్ ముర్ము మరియు తన ఫొటోలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఆ ఫొటోలను పెన్నుతో క్రాస్ మార్క్ చేశారని ఆమె తెలిపారు. లెటర్‌లో ఉర్దూలో ఏదో రాశారని సాధ్వీ తెలిపారు. తాము దేశం కోసం పనిచేస్తుంటే.. తమని చంపాలని కొంతమంది శత్రువులు మరియు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.