
- ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మదర్సాల్లో ఉండే పిల్లల గుర్తింపుపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మదర్సాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను తీసుకువచ్చి, తప్పుడు సర్టిఫికెట్లతో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు శిక్షణ ఇస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిన్నారం శివాలయంలో లింగాన్ని కోతులు ధ్వంసం చేశాయని పోలీసులు చెప్తున్నారని, దగ్గరలోని మదర్సాలో ఎవరున్నారు? ఆ మదర్సాకు అనుమతులున్నాయా అని ఆయన ప్రశ్నించారు. జిన్నారం మదర్సాలో 70 మంది విద్యార్థులున్నారని, వారిలో 65 మంది బీహార్‌కు చెందిన కిషనగంజ్‌వారేనని అన్నారు. కిషన్ గంజ్.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.
మదర్సా ఇచ్చే సర్గిఫికెట్ ఏంటి? దానికి ఉన్న విలువేంటనేది కూడా చెప్పాలన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో బంగ్లాదేశీయులకు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రశాంతంగా ఉన్న దేశాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు. మదర్సాల వివరాలు చెప్పాలని డీజీపీని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. ఇస్నాపూర్‌లో 247 మంది నేపాలీలకు ఆధార్ కార్డ్ ఇచ్చారని ఆరోపించారు. దీన్ని అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తానని రఘునందన్ రావు స్పష్టం చేశారు.