
దీపావళి పండగ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి ఇంట్లో విషాదాన్ని నింపింది. పటాకులు పేలడంతో ఆ మంటలకు ఆమె ఆరేళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది. రీటా జోషి మనవరాలు కియాను కాలిన గాయాలతో దీపావళి రోజున ఆస్పత్రిలో చేర్పించగా.. ఇవాళ ఉదయం ఆమె చనిపోయింది. రీటా జోషి ఇంట్లో దీపావళి రోజున ఆమె మనవరాలు కియా టెర్రస్ పైన పటాకులు కాల్చుతుండగా మంటలు ఆమె డ్రెస్ కు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆమె ఎంత అరిచినా పటాకుల సౌండ్ కు ఎవ్వరీకి వినబడలేదు. తర్వాత కొద్ది సేపటికి గాయాలైన ఆ చిన్నారిని ప్రయాగ్ రాజ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 60 శాతం కాలిపోయింది. మెరుగైన చికిత్స కోసం చిన్నారిని ఢిల్లీలోని మిలటరీ ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా .. ఇవాళ ఉదయం మరణించింది. మనవరాలి మృతితో రీటా ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. ఆరేళ్ల చిన్నారి కియా కొన్ని రోజుల క్రితం కరోనా నుండి కోలుకుంది.