
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం (ఆగస్టు 18) అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో జె. శ్యామలారావు.
బ్రహ్మోత్సవాల తొలిరోజు- సెప్టెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు ఈవో శ్యామలరావు . సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రద్దీ నిర్వహణకు ముందుగా అంచనా వేసి జాగ్రత్తలు చేపట్టాలని సమావేశంలో ఈవో అధికారులను ఆదేశించారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు. - ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. - ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసుల సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. -ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది.
అన్నమయ్య భవనంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో పాటు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలు, టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్యనారాయణ, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీ జగదీష్, ఇతర టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.