Airtel: ఎయిర్‌టెల్ సేవలు డౌన్: ఫోన్లు కలవటలేదు.. నెట్ పనిచేయట్లేదు..!

Airtel: ఎయిర్‌టెల్ సేవలు డౌన్: ఫోన్లు కలవటలేదు.. నెట్ పనిచేయట్లేదు..!

Airtel down: దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్లో టాప్ కంపెనీల్లో ఒకటి ఎయిర్‌టెల్. ఆగస్టు 18 మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా సేవల్లో సాంకేతిక అంతరాయం ఎదురైంది. ఈ అవుటేజ్ కారణంగా వేలాది మంది వినియోగదారులు కాల్స్ చేయలేకపోవడం, మొబైల్ డేటా పనిచేయకపోవడం, లేదా పూర్తిగా సిగ్నల్ లేకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ, అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్ ఫారమ్లలోనూ వినియోగదారులు ఈ సమస్యపై పోస్టులు పెడుతున్నారు. 

మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో అకస్మాత్తుగా సేవల్లో అంతరాయానికి సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. సాధారణంగా కంపెనీపై రోజువారీగా కొద్ది డజన్లలోనే ఫిర్యాదులు నమోదవుతుంటే.. ఈసారి ఒక్కసారిగా 2,500కి పైబడిన రిపోర్టులు వచ్చాయి. ఈ అవుటేజ్ ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల వినియోగదారులను ఇబ్బందికి గురిచేసినట్లు వెల్లడైంది. 56 శాతం మంది కాల్స్ విషయంలో.. 26 శాతం మంది ఇంటర్నెట్ సేవల అంతరాయం, 18 శాతం మంది మెుబైల్ నెట్ వర్క్ సిగ్నలింగ్ సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. 

బెంగళూరులోని వినియోగదారులు ఎయిర్ టెల్ 4G సర్వీసు గంటల తరబడి పూర్తిగా నిలిచిపోవటంతో వర్క్–ఫ్రం–హోమ్ అలాగే ఆన్ లైన్ పనులకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. మరికొందరు దీనిని పరిష్కరించకపోతే ఇతర నెట్ వర్క్ లకు పోర్ట్ అవుతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెట్రో నగరాల్లోనే సిగ్నల్ డ్రాప్ కావటంపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండటం సేవలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. 

అయితే అకస్మాత్తుగా ఏర్పడిన ఈ నెట్ వర్క్ ఔటేజీ సమస్యపై ఎయిర్ టెల్ స్పందించింది. ప్రస్తుతం తమ టెక్నికల్ టీం వెంటనే సేవలను పునరుద్ధరించడానికి కృషి చేస్తోందని కంపెనీ వెల్లడించింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామంటూ క్షమాపణలు చెప్పింది కంపెనీ.