ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పెన కాలం నాటి పరిస్థితులు.. భద్రతపై గ్రామాల్లో డప్పు చాటింపులు..!

ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పెన కాలం నాటి పరిస్థితులు.. భద్రతపై గ్రామాల్లో డప్పు చాటింపులు..!

ఆదిలాబాద్ జిల్లా జలదిగ్బంధంలో కూరుకుపోయింది. కుండపోత, క్లౌడ్ బరస్ట్.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణాలు ఎక్కడ చూసినా నీళ్లే. వాగులు నదులైతుంటే.. ఊర్లు చెరువుల్లా మారిపోయాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారినపోయాయి. భారీగా వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. అయినప్పటికీ వరద జిల్లా  మొత్తాన్ని కమ్ముకుంటోంది. నీటి గండం ఉందా అన్నట్లుగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు

చెరువులు కట్టలు తెంచుకుని వస్తున్నాయా అన్నట్లుగా భారీ వరద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతోంది. దీంతో పలు గ్రామాల్లో డప్పు చాటింపులు వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ గ్రామంలో డప్పు చాటింపు వేశారు. భారీ వర్షాలతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో.. ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని  హెచ్చరికలు   జారి  చేశారు  అధికారులు.

నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వరద నీటితో ముంపు ప్రభావం మొదలైంది. ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను ఎత్తివేసి సుద్ధ వాగులోకి 13 వేల క్యూసెక్కుల నీటిని వదిలుతున్నారు. ఈ క్రమంలో సుద్ధ వాగు పొంగి పొర్లుతూ ఉదృతితో ప్రవహిస్తోంది. 

ఇందులో భాగంగానే గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వరద నీరు సుద్ద వాగు బైపాస్ రోడ్డు వంతెనను ముంచెత్తింది. ప్రాజెక్టు వరద నీరు బైపాస్ రోడ్డు వంతెన మీదుగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది . బైపాస్ రోడ్డు సైతం వరద నీటిలో కోతకు గురయ్యింది.

మరోవైపు బోరజ్  మండలంలో తర్నామ్  వాగు  ఉధృతంగా  ప్రవాహిస్తోంది. ఉప్పెనను మరిపించేలా వాగు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ ఏరియాల్లో రాకపోకలు  నిలిచిపోయాయి. ప్రజలు వాగు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదాన్ని ముందే ఊహించి వర్షంలో సైతం అక్కడే ఉండి ప్రజలను అటుగా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. 

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తిన అధికారులు:

అటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి  రికార్డు స్థాయిలో  వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు ఆరు  గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. ఇన్ ఫ్లో10,294 క్యూసెక్కులు ఉండగా  అవుట్  ఫ్లో  33,930 క్యూసేక్కులుగా ఉంది.  ప్రస్తుతం నీటిమట్టం 694.900 అడుగుల వద్దకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు.  ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు. 

మరోవైపు భారీ వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.  దీంతో ప్రాజెక్టు 6 గేట్లను 3.0 మీటర్ల మేర ఎత్తి 38,763  క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.  ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా  ప్రస్తుతం 237.80 మీటర్లకు చేరడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.872 ఉంది. ప్రాజెక్ట్ లోకి 26,667 ఇన్ ఫ్లో కొనసాగుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.