ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ట్రంప్‎తో భేటీ వివరాలన్నీ చెప్పేసిన రష్యా ప్రెసిడెంట్

ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ట్రంప్‎తో భేటీ వివరాలన్నీ చెప్పేసిన రష్యా ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ఫోన్ చేశారు. ఇటీవల అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎తో భేటీ అయిన వివరాలను ప్రధాని మోడీతో పంచుకున్నారు పుతిన్‌. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పుతిన్ తనకు ఫోన్ చేసి ట్రంప్‎తో జరిగిన భేటీ వివరాలను చెప్పారన్నారు మోడీ.  ‘‘నా స్నేహితుడు పుతిన్‎ ఫోన్ చేసి ఇటీవల అలాస్కాలో ట్రంప్‎తో జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను నాకు వెల్లడించినందుకు ధన్యవాదాలు’’ అని మోడీ ట్వీట్ చేశారు.

దౌత్యం, చర్చల ద్వారా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే భారత వైఖరిని ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు మోడీ. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ నిరంతరం పిలుపునిచ్చిందని గుర్తు చేసిన మోడీ.. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. 

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత మూడేళ్లుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపి కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదర్చడమే ప్రధాన అజెండాగా డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025, ఆగస్టు 15న అలాస్కాలో సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు ఇరు దేశాధినేతలు పై అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

అయితే ఈ భేటీలో ఎలాంటి కీలక ఒప్పందం కుదరనప్పటికీ.. చర్చలు మాత్రం సానుకూలంగా సాగాయని ట్రంప్, పుతిన్ పేర్కొన్నారు. తదుపురి సమావేశం కోసం రష్యా రావాలని ట్రంప్‎ను ఆహ్వానించారు పుతిన్. ఈ క్రమంలో రష్యాకు చిరకాల మిత్రదేశమైన భారత్‎కు ట్రంప్ తో జరిగిన భేటీ వివరాలను వెల్లడించారు పుతిన్.