అక్బరుద్దీన్.. ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటావ్: బీజేపీ ఎంపీలు

అక్బరుద్దీన్.. ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటావ్: బీజేపీ ఎంపీలు

ఢిల్లీ: బీజేపీ ఆరెస్సెస్ మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని… కేసీఆర్ పాముకు పాలుపెట్టి పోషిస్తున్నారని విమర్శించారు. హిందువులను చంపేస్తామన్న పార్టీతో టీఆర్ఎస్ ఎలా దోస్తీ చేస్తోందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు : బండి సంజయ్

టీఆరెస్, ఎంఐఎం లు ఇద్దరూ కలసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో కార్పొరేషన్ లు ఎంఐఎం పార్టీ కి ఎక్కువ ఇచ్చేలాగా టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారని విమర్శిస్తున్న  అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం అందరికీ ఉందని, ఎవరైనా ప్రధాని అవ్వచ్చని అన్నారు. దేశంలో దేశ భక్తులు రాజ్యం నడుస్తోందని అన్నారు. ముస్లిం మహిళలు బాగు కోసం మోడీ ట్రిపుల్ తలాక్ ని చట్ట బద్దం చేయడం కోసం కృషి చేస్తుంటే.. వారి మహిళలకు వ్యతిరేకంగా ఎంఐఎం వ్యవహరిస్తోందని అన్నారు.

15 నిమిషాల సమయం ఇస్తే.. హిందువుల అంతు చూస్తా అన్న అక్బరుద్దీన్ కు వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. తమకు కేవలం ఒక్క సెకెన్ చాలని, కాని తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అని తెలిపారు.హిందువులను చంపేస్తాం అన్న పార్టీ తో టీఆరెస్ దోస్తీ కట్టాలని చూస్తుందని.. ఈ విషయంపై టీఆరెస్ కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు. రానున్న ఎన్నికలలో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతుందని ఆయన అన్నారు.

ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటావ్: అర్వింద్

ప్రజలు దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారని ఓవైసీ అన్నదమ్ముల నుద్దేశించి ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ముస్లిం పేరుతో అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారని, ప్రస్తుతం టీఆరెస్ తో కుమ్మకై ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మత రాజకీయాలకు తెర తీస్తోందని ఆయన అన్నారు.

అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ.. ఏప్రిల్ 20న నీ ఇలాఖాలోనే ఏం జరిగిందో గుర్తు లేదా? అని ప్రశ్నించారు అర్వింద్. మీ వాళ్ళు నిన్ను పొడిచి కిడ్నీలు, అవయవాలు అన్ని డీలా  అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? అంటూ గతాన్ని గుర్తు చేశారు. 80 శాతం హిందువులు ఉన్న వారి గురించి మళ్ళీ చూసుకోవచ్చు…కానీ మీ వాళ్ళ గురించి చూసుకోమని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండమని…లేదంటే  ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటావని అక్బరుద్దీన్ ను హెచ్చరించారు అర్వింద్.