
- చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే..
- కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్లపై వివేక్ వెంకటస్వామి
- ఆయన వల్లే పంప్ హౌస్లు మునిగినయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్.. విదేశీ కుట్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిర్వాకం వల్లే కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగాయని మండిపడ్డారు. ఇందుకు తప్పుడు డిజైన్ లే కారణమని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేసీఆర్ వాళ్ల గురించి పట్టించుకోవడం లేదు.
జనం త్వరలోనే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు. గతంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చాలాసార్లు వరదలు వచ్చాయని, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై సర్కార్ దగ్గర సరైన ప్లానింగ్ లేదని మండిపడ్డారు. వరదల నివారణకు చర్యలు చేపట్టక, క్లౌడ్ బరస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తనకు తాను ఇంజనీర్ అని చెప్పుకునే కేసీఆర్.. తుగ్లక్ లాగా ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు ప్లేస్ లో కట్టి, రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. కానీ ప్రాజెక్టు ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసిన తరువాత అవన్నీ వృథాగా పోతున్నాయి. తప్పుడు డిజైన్ తో ప్రజల సొమ్ము వృథా చేశారు” అని మండిపడ్డారు. సీఎం పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.