బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా ఖరారు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా ఖరారు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. HICC నోవాటెల్ ఈ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేషనల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండాను ఖరారు చేశారు. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై కార్యవర్గ సమావేశాల్లో చర్చ జరుగనుంది. 2024లో దేశంలో మళ్ళీ అధికారంలోకి రావటం, దక్షిణాదిన బలం పెంచుకోవటం తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. అలాగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆంధ్ర, తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై చర్చించనున్నారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణను రూపొందించనున్నారు. కేరళలో కార్యకర్తలకు మనోధైర్యం కల్పించటం, ఉత్తరాది‌న రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించనున్నారు. నార్త్ లో తగ్గుతోన్న ఎంపీ స్థానాలను సౌత్ లో పెంచుకునే వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే.. దేశ ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగనుంది. విదేశాంగ విధానంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా అవలంబించాల్సిన విధానంపై నేతలు చర్చించనున్నారు. ఇతర దేశాలతో సంబంధాలపై ప్రభుత్వానికి సూచించాల్సిన అంశాలపై కూడా చర్చ జరుగనుంది.