AIతో చిప్ కష్టాలు.. సౌత్ కొరియా చుట్టూ గూగుల్, ఆపిల్, అమెజాన్ ప్రదక్షిణలు

AIతో చిప్ కష్టాలు.. సౌత్ కొరియా చుట్టూ గూగుల్, ఆపిల్, అమెజాన్ ప్రదక్షిణలు

నేటి ఆధునిక ప్రపంచంలో డేటానే ఇంధనం అయితే.. ఆ డేటాను ప్రాసెస్ చేసే 'మెమరీ చిప్స్' ఇప్పుడు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. ఏఐ వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరగడంతో, దానికి అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం నడుస్తోంది. ఈ చిప్స్ కొరత ఎంత తీవ్రంగా ఉందంటే.. ఆపిల్, గూగుల్, అమెజాన్, డెల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఎగ్జిక్యూటివ్‌లను దక్షిణ కొరియాలోని హోటళ్లలో నెలల తరబడి ఉంచి.. చిప్ తయారీ కంపెనీలతో సరఫరా కోసం చర్చలు నడిపిస్తున్నాయి.

ఆకాశాన్నంటిన ధరలు.. 
2025 మధ్య కాలం నుండి మెమరీ చిప్స్ (RAM) ధరలు ఏకంగా 300 శాతం పెరిగాయి. ఉదాహరణకు.. గతంలో తక్కువ ధరకు లభించిన 12 GB ర్యామ్ మాడ్యూల్ ధర ఇప్పుడు ఆపిల్ వంటి కంపెనీలకు 70 డాలర్లు అంటే సుమారు రూ.5,800 వరకు పడుతోంది. 2025 ఆరంభంతో పోలిస్తే ఇది 200 శాతం పెరుగుదల. ఈ ధరల పెరుగుదల స్మార్ట్‌ఫోన్లు, సర్వర్ల తయారీ ఖర్చులను భారీగా పెంచేస్తోంది.

హోటళ్లలోనే బేరసారాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ సంస్థలైన శామ్సంగ్, ఎస్కే హైనిక్స్ కార్యాలయాలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. వీటి నుంచి చిప్స్ సరఫరాను ముందే బుక్ చేసుకోవడానికి ఆపిల్ తన కొనుగోలు బృందాలను అక్కడి గ్వాంగ్గీ ప్రావిన్స్‌లోని బిజినెస్ హోటళ్లలో దింపింది. కేవలం ఆపిల్ మాత్రమే కాదు.. డెల్, గూగుల్, అమెజాన్ ప్రతినిధులు కూడా అక్కడే తిష్ట వేశారు. ఈ వింత పరిస్థితిని స్థానికులు సెమీకండక్టర్ టూరిజం అని పిలుస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్ల పాటు తమకు చిప్స్ సరఫరా అయ్యేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవటానికి ఈ కంపెనీలు లాబీయింగ్ నడిపిస్తున్నాయి.

ఏఐ తెచ్చిన చిక్కులు.. 
సాధారణ ఫోన్లలో వాడే ర్యామ్ కంటే ఏఐ సిస్టమ్స్‌కు 'HBM3E' అనే ప్రత్యేకమైన మెమరీ చిప్స్ అవసరం. ఎన్విడియా వంటి కంపెనీలు తయారు చేసే ఏఐ యాక్సిలరేటర్లకు ఈ చిప్స్ భారీగా కావాలి. చిప్ తయారీ కంపెనీలన్నీ తమ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని ఈ ఖరీదైన ఏఐ చిప్స్ తయారీకే కేటాయిస్తుండటంతో.. సాధారణ ఫోన్లు, కంప్యూటర్లలో వాడే చిప్స్ కొరత పెరిగిపోతోంది.

వినియోగదారులపై ప్రభావం.. 
చిప్స్ ధరలు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఐఫోన్లు, ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లేదా ధరను స్థిరంగా ఉంచడానికి కంపెనీలు ఫోన్లలో మెమరీ సామర్థ్యాన్ని (RAM) తగ్గించవచ్చు. మెుత్తానికి సౌత్ కొరియా హోటల్ గదుల్లో జరుగుతున్న ఈ చర్చలు రేపు మన చేతిలోని ఫోన్ ధరను, పనితీరును నిర్ణయించబోతున్నాయి. ఏది ఏమైనా ఏఐ విప్లవం టెక్ ప్రపంచాన్ని ఒక వింతైన 'చిప్ వార్' వైపు నెట్టేసింది.