ఆ మూడు నియోజకవర్గాలకే అభివృద్ధి ఫలాలు

ఆ మూడు నియోజకవర్గాలకే అభివృద్ధి ఫలాలు

వికారాబాద్: కేసీఆర్ కు ఉప ఎన్నికలప్పుడే అభివృద్ధి గుర్తొస్తుందని... మామూలు సమయంలో ఫాంహౌజ్ కే పరిమితమవుతారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తాండూరులో ప్రారంభమైన ‘పల్లె గోస–బీజేపీ భరోసా యాత్ర’ రెండో విడత కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కు ఉప ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా 10 లక్షల పింఛన్లు ప్రకటించారని చెప్పారు. 

సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకే అధిక మొత్తంలో నిధులు వెళ్తున్నాయన్న డీకే అరుణ... రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపై కేసీఆర్, కేటీఆర్ వివక్షత ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. తాండూరులో నాపరాయి, సుద్ద వంటి అపార ఖనిజ సంపదలున్నాయని, అలాగే సిమెంట్ పరిశ్రమలు, కంది పప్పు ఉత్పత్తిలో తాండూరు పేరుగాంచిందన్నారు. కానీ కేసీఆర్ పాలనలో తాండూరు వివక్షతకు గురైందని... కనీసం మౌళిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని మండిపడ్డారు. నిత్యం హెలికాప్టర్, విమానాల్లో  తిరిగే కేసీఆర్, కేటీఆర్ కు స్థానిక రోడ్ల గురించి ఏం తెలుస్తుందన్నారు.  ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.