టీఆర్ఎస్​ను తరిమి కొట్టాలని డీకే అరుణ పిలుపు

టీఆర్ఎస్​ను తరిమి కొట్టాలని డీకే అరుణ పిలుపు

గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ను తరిమి కొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. ‘ప్రజా గోస– బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా సోమవారం ఆమె జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం గువ్వలదిన్నె, పూజారి తండా, తోటతండా, కేటిదొడ్డి, ఉమిత్యాల తండా, ఉమిత్యాల గ్రామాల్లో పర్యటించారు. బీజేపీ జెండాలు ఎగరవేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందర మాత్రమే సీఎం కేసీఆర్​స్కీములతో హడావుడి చేస్తారని, తర్వాత మళ్లీ వాటి జాడే ఉండదని విమర్శించారు.

ప్రతి స్కీములో స్కాంలు చేస్తున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా జిల్లాలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. ఒకరిద్దరికి గొర్రెలు పంచుతామని, దళిత బంధు ఇస్తామంటూ వచ్చి ఓట్లు దండుకుంటారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ఓటేస్తే గోస తప్పదని చెప్పారు. బీజేపీకి ఓటేసి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, తిరుమల్ రెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.