కమీషన్ల కోసమే చెక్ డ్యాంల నిర్మాణం ..నాణ్యతపైనా సమగ్ర విచారణ జరిపిస్తాం

కమీషన్ల కోసమే చెక్ డ్యాంల నిర్మాణం ..నాణ్యతపైనా సమగ్ర విచారణ జరిపిస్తాం
  • రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి చెక్ డ్యాంలను నిర్మించిందని, దీంతో కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా పనులు చేయడంతోనే కొట్టుకుపోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లిలో చెక్ డ్యామ్ ను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.

 అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవి సోమన్ పల్లి చెక్ డ్యామ్ గత ప్రభుత్వంలో  నాణ్యత లేకుండా  నిర్మించడంలతోనే కూలి పోయిందని ఆరోపించారు.  ఘటన జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని, సమగ్ర విచారణలో నిజ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆదేశించారు. 

నాణ్యతలేని కాళేశ్వం ప్రాజెక్ట్, మంథనిలోని చెక్ డ్యాంల వల్ల ఎన్ని పొలాలు బాగుపడ్డాయో, ఎవరు లాభపడ్డారో ప్రజలు చూస్తున్నారన్నారు. సమగ్ర విచారణలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  

మంథని టౌన్ లో శివ కిరణ్ గార్డెన్ లో కొత్గా ఎనికైన సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను సన్మానించారు. అనంతరం క్రైస్తవ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు కుడుదల వెంకన్న, గట్టు దామోదర్, కొత్త శ్రీనివాస్, అయిలి ప్రసాద్, సెగ్గం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.