- నీటి వాటాల్లో కేసీఆర్ చేసింది ద్రోహమే
- కొత్త ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తే
- 650 టీఎంసీలు మనకే
- కృష్ణా నదీ జలాల వాటా, పాలమూరు
- ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల పంపకాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. కేసీఆర్చేసుకున్న 299 టీఎంసీల ఒప్పందమే రాష్ట్రానికి ‘మరణ శాసనం’గా పరిణమించిందని ఆరోపించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి కృష్ణా జలాల పంపకాలు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను వివరించారు.
మొత్తం 811 టీఎంసీలలో.. కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పందం చేసుకున్నారో ఆయనకే తెలియాలన్నారు. ఈ ఒప్పందం వెనుక కేసీఆర్‌కు ఉన్న ప్రయోజనాలు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్లానింగ్ కళ్లముందే ఉన్నా.. తక్కువ నీటి వాటాకు సంతకం పెట్టి పాలమూరు ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హడావుడి వల్లే 299 టీఎంసీలు తెచ్చుకున్నా.. పూర్తిస్థాయిలో నీటిని వాడుకోవడంలో విఫలమయ్యారని, ఎన్నికల వేళ హడావుడి తప్ప ఒక్క ఎకరానికి నీరు పారలేదని విమర్శించారు.
ఆ ప్రాజెక్టులను గాలికి వదిలేశారు..
పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, కోయిల్ సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను 2015 వాటర్ షేరింగ్ అగ్రిమెంట్‌లో చేర్చకపోవడం ఘోర తప్పిదమని వెదిరె శ్రీరామ్ అన్నారు. ఈ ప్రాజెక్టులకు 261.7 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గత పదేండ్లలో ఒప్పందం చేసు కున్న ఆ 299 టీఎంసీలను కూడా కేసీఆర్ సర్కార్ పూర్తిగా వాడుకోలేకపోయిందన్నారు. ఎన్నికల ముం దు మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టు పూర్తయిందని బిల్డప్ ఇచ్చారు తప్ప.. కాల్వలు తవ్వక, రైతులకు నీళ్లివ్వక మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లెక్కలివ్వకే డీపీఆర్ వెనక్కి..
పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ ఇవ్వడానికి కేసీఆర్ 14 నెలల ఆలస్యం చేశారని శ్రీరామ్ ధ్వజమెత్తారు. ‘‘ప్రాజెక్టు కోసం మైనర్ ఇరిగేషన్ కింద 45 టీఎంసీలు వాడుకుంటామని చెప్పారు. కానీ, ఆ 45 టీఎంసీలు ఏయే చెరువులు, కుంటల కింద వాడుతారో లెక్కలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదు. అడిగిన డేటా ఇవ్వకపోవడం వల్లే డీపీఆర్ ను కేంద్రం తిరస్కరించలేదు.. కేవలం వెనక్కి పంపింది. ఇప్పటికైనా ఆ 45 టీఎంసీల ట్యాంక్ వైజ్ వివరాలు ఇస్తే ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీరు వస్తుంది" అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా హైడ్రాలిక్, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్సులు లేవని గుర్తు చేశారు.
కొత్త ట్రిబ్యునల్‌తోనే న్యాయం..
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్ లో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిందని శ్రీరామ్ గుర్తుచేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపిస్తే 600 నుంచి 700 టీఎంసీల నీటిని సాధించుకునే అవకాశం ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ ఆలస్యం చేయడం వల్లే ఏపీకి వర్క్ ఆర్డర్లు ఇచ్చుకునే అవకాశం దొరికిందన్నారు.
ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ కుట్ర: రాంచందర్ రావు
పాలమూరు–రంగారెడ్డిని ఒక ట్రంప్ కార్డులా వాడుకుంటూ.. ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ కుట్ర చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ విషయం తనకు స్వయంగా ఓ బీఆర్ఎస్ నాయకుడే చెప్పారని తెలిపారు. ‘‘పులి బయటికి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. పులి, పిల్లులు రావడం కాదు.. ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి”అని అన్నారు. బీజేపీ ఓటు శాతం పెరుగుతోందన్న భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారని ఆయన అన్నారు.
కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. గంటన్నర స్పీచ్ లో కేంద్రంపై అబద్ధాలు చెప్పడం తప్ప పస లేదన్నారు. త్వరలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేసి విజిట్ చేస్తామని, జిల్లాల్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
