అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

గద్వాల: పేదలకు కేటాయించిన స్థలాల్లో హాస్పిటల్ ఎలా నిర్మిస్తారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు.  దౌదర్‌పల్లి దర్గా వద్ద  పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూమిలో నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో లబ్దిదారులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా దౌదర్ పల్లి దర్గాకు చేరుకున్న డీకే అరుణ లబ్దిదారులతో కలిసి ఇళ్ల స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... తాను మంత్రిగా ఉన్నప్పుడు 1400 మంది నిరుపేదలకు ఇళ్ల  పట్టాలను పంపిణీ చేశానని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం... ఇచ్చిన స్థలాలను కూడా లాక్కోవడం సమంజసం కాదన్నారు. టీఆర్ఎస్ స్థానిక నాయకుడు పేదల స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం స్థల సేకరణ చేతకాకపోతే ... తాను ఆ స్థలాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అంతే గానీ ఇలా పేదల భూములను లాక్కుంటామంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే  ఆమరణ నిరాహార దీక్ష చేసైనా పేదల భూములను రక్షిస్తానని తేల్చి చెప్పారు.