
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
గద్వాల, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ హడావిడిగా పనులు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 8 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను ఇప్పుడు ప్రారంభించి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేశారన్నారు. శనివారం గద్వాలలో ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే గట్టు లిఫ్ట్‌ను మూడు నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేకుండా ఎవరి భూమి ఎంత పోతుందో తెలియకుండా, రైతులతో మీటింగ్ పెట్టకుండా గట్టు లిఫ్ట్ పనులను ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. పేదల ప్లాట్లను గుంజుకొని నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటక్షన్ లేకుండా హాస్పిటల్ నిర్మాణం దగ్గరికి రావాలని ఆమె సవాల్ చేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దేశ్ కి నేత అంటూ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఉట్టికి ఎగర లేనమ్మ.. స్వర్గానికి ఏగిరినట్లు సీఎం కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. దేశ రాబంధుల సమితిగా టీఆర్‌ఎస్ మారబోతుందని జోస్యం చెప్పారు. షాడో సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని, మంత్రులు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.