టీఆర్​ఎస్​ సర్కార్​పై జనంలో తీవ్ర అసంతృప్తి

టీఆర్​ఎస్​ సర్కార్​పై జనంలో తీవ్ర అసంతృప్తి
  • రుణ మాఫీ అమలు ఏమైంది?.. పింఛన్లు ఎటుపోయినయ్​? 
  • ప్రాజెక్టుల కమీషన్లతో కేసీఆర్  సొంత ఆస్తులు పెంచుకున్నారని ఫైర్​
  • జుక్కల్​ నియోజవర్గంలో కొనసాగిన ‘ప్రజా గోస..బీజేపీ భరోసా’ యాత్ర

కామారెడ్డి/ నిజాంసాగర్, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్​ సర్కారు విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెంచి, అలా వచ్చిన కమీషన్ల సొమ్ముతో  సీఎం కేసీఆర్​ సొంత ఆస్తులు పెంచుకున్నడు. కేసీఆర్​, ఆయన కొడుకు  కేటీఆర్​ ఫామ్​హౌస్​లు నిర్మించుకుంటున్నరు. ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదు” అని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్​ను గద్దె దించాలన్నారు. ‘ప్రజా గోస..-  బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా  రెండో రోజు శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  నిజాంసాగర్​ మండలంలో బీజేపీ నేతల పర్యటన కొనసాగింది. కొమలంచ,  దుఫ్​సింగ్​ తండా, గాలిపూర్​, మగ్ధుంపూర్,  మహ్మద్​నగర్​, ఒడ్డెపల్లి, జక్కాపూర్​ , మల్లూర్​లో  వివేక్​ వెంకటస్వామి తదితరులు  స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ..  ‘‘ప్రస్తుతం రాష్ట్ర అప్పును కేసీఆర్​ రూ. 5లక్షల కోట్లకు తీసుకెళ్లిండు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పెంచిన వ్యయంతో  పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగేది” అని అన్నారు. ‘‘క్రాప్​ లోన్లు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు..  ఫించన్లు ఇవ్వడం లేదు. కేసీఆర్​ గ్రాప్​ ఎన్నికల టైంలో 45 శాతం ఉండగా ఇప్పుడు 29 శాతానికి పడిపోయింది. ప్రజలు కేసీఆర్​పై, ఆయన పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు” అని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా కేసీఆర్​ పంపిణీ చేయలేదన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార మాట్లాడుతూ..  స్థానిక ఎమ్మెల్యే  గ్రామాల్లోకి రావడం లేదని,  ప్రజల సమస్యల్ని  పట్టించుకోవడం లేదన్నారు.  యాత్రలో నేతలు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, చిన్న రాజులు, సాయిలు,  దత్తేశ్వరి, చైతన్యగౌడ్​,  రాము , భరత్​, నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహ్మద్​నగర్​లో జరిగిన కార్యక్రమంలో  ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి కూడా పాల్గొన్నారు.