
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, వాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తే టీమిండియాకు ఆడే స్థాయికి ఎదుగుతారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. క్రీడల అభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ (టీడీఎల్) ఫైనల్ మ్యాచ్‌కు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లని ప్రోత్సహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు లీగ్ నిర్వహించిన వివిధ జిల్లాలకు చెందిన క్రికెట్ సంఘాల ప్రతినిధులను అభినందించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు.- అలాంటి వాళ్లకు కొంచెం చేయూత అందిస్తే టీమ్ ఇండియాకు ఆడే స్థాయికి ఎదుగుతారు. - ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి చాలా డబ్బులు వచ్చాయి. అందులో కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధి కోసం కేటాయిస్తే బాగుంటుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. వివేక్ వెంకటస్వామి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు ‘జి. వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ టీ20’ లీగ్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఆ టోర్నీతో ఎంతో మంది గ్రామీణ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కొంత మంది హైదరాబాద్ రంజీ జట్టుకు కూడా ఎంపికయ్యారు. ఆ టోర్నీ స్ఫూర్తితో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని ఉమ్మడి ఎనిమిది జిల్లాలతో నిర్వహించిన టీడీఎల్ మంచి సక్సెస్ సాధించింది.
చాంపియన్ మెదక్
తెలంగాణ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్‌లో ఉమ్మడి మెదక్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో 3 వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి -విజేతలకు బహుమతులు అందించారు.