బీజేపీ హవాలో.. కులం కోటలు బద్దలు

బీజేపీ హవాలో.. కులం కోటలు బద్దలు

న్యూఢిల్లీఉత్తరప్రదేశ్.. దేశంలో లోక్ సభ సెగ్మెంట్లు ఎక్కువగా ఉన్న రాష్ర్టం. కేంద్రంలో అధికారానికి దారి చూపే స్టేట్. 2014 ఎన్నికల్లో 70కిపైగా సీట్లు సాధించి, సెంటర్​లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటిలా కాకున్నా తాజా ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ 60కి పైగా సీట్లు గెలిచింది. కులాల ఓట్ల కోసం ఎస్పీ–బీఎస్పీ ఏకమైతే.. హిందుత్వం, నేషనలిజం ఎజెండాతో ‘కులం కోటలు’ బద్దలు కొట్టింది బీజేపీ. నాన్ ముస్లిం, నాన్ దళిత్, నాన్ యాదవ్ ఓట్లను గంపగుత్తగా సాధించింది.

నేషనలిజం, హిందుత్వం

యూపీలో బీజేపీని అడ్డుకునేందుకు ఎస్సీ–బీఎస్పీ కూటమి జతకట్టినా.. కాషాయ పార్టీ గాలిని అడ్డుకోలేకపోయాయి. ముస్లిం, యాదవ్, ఎస్సీల ఓట్లు తమవైపే ఉన్నా కూటమి మంచి ఫలితాలు సాధించలేకపోయింది. కూటమి భావించినట్లుగా కులం కార్డు పని చేయలేదు. దానికన్నా ఎక్కువగా నేషనలిజం, హిందుత్వం బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించాయి. యూపీలో ప్రతి ఇద్దరిలో ఒకరు బీజేపీకి ఓటేయడమే ఇందుకు నిదర్శనం. మొత్తం సగం ఓట్లు (49.56 శాతం) కాషాయ పార్టీకి దక్కాయి. కులం ఓట్లతో మెజారిటీ సీట్లు సాధించాలనుకున్న ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 38.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. తమ కోర్ ఓటర్లు (ముస్లింలు, ఎస్సీలు) 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి విజయం సాధించింది. ఎస్పీ-బీఎస్పీ కూటమి వైపు కోర్ ఓటర్లు ఉంటే.. నాన్ ముస్లిం, నాన్ ఎస్సీ ఓటర్లు ఏకమై బీజేపీ పట్టం కట్టారు.

ముస్లింలు 20 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా..

78 సీట్లలో సగటున ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు సంయుక్తంగా పడ్డ ఓట్లు 39.77 శాతం. కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేస్తున్న రాయ్ బరేలీ, అమేథీల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. యూపీలోని 28 నియోజకవర్గాల్లో ముస్లిల జనాభా 20 శాతం కన్నా ఎక్కువగా ఉంది. కానీ ఇందులో కూటమి కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. మిగతా 20 సెగ్మెంట్లలో బీజేపీ గెలిచింది. అంటే ఈ 20 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా 20 శాతం పైగా ఉన్న ముస్లింలు ఓటేసినా, నాన్ ముస్లిం ఓట్లు మాత్రం గంపగుత్తగా కాషాయపార్టీకి పడ్డాయని అర్థమవుతోంది. ఇక్కడ నాన్ ముస్లిం ఓటర్లు ఏకమైనట్లు స్పష్టమవుతోంది. బీజేపీ ‘రిలీజియన్ పాలిటిక్స్’ దెబ్బకు కుల సమీకరణాలేవీ పని చేయలేదని తెలుస్తోంది. వర్గాలుగా, పార్టీల వారీగా విడిపోయిన ఓటర్లు ఏకమై బీజేపీ వైపు మొగ్గారు.

కొన్నిచోట్ల గట్టి పోటీ

ముస్లింల జనాభా 40 శాతంపైగా ఉన్న నియోజకవర్గాల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమి మెరిసింది. అక్కడ మంచి ఫలితాలు సాధించింది. మొరాదాబాద్, నగీనా, రాంపూర్, సహారన్​పూర్, సంభాల్ సెగ్మెంట్లలో మంచి మార్జిన్​తో గెలిచింది. సహారన్​పూర్ లో బీజేపీ, కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కేవలం 1.82 శాతం ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థి గెలిచారు. పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. దీని వల్ల కూటమి అభ్యర్థి గెలుపు కష్టమైంది. ఇక శ్రావస్తీ సీటులో కూడా బీఎస్పీ, బీజేపీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నడించింది. కేవలం 5,320 ఓట్ల తేడాతో బీఎస్పీ కేండిడేట్ రామ్ శిరోమణి గెలిచారు. ఇక్కడ 30 నుంచి 35 శాతం ముస్లింలు, 16.64 శాతం ఎస్సీలు ఉన్నప్పటికీ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. మరోవైపు ముస్లిం పాపులేషన్ తక్కువగా ఉండి, ఎస్సీ జనాభా 20 శాతం కన్నా ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూడా కూటమి గెలిచింది. ఘాజీపూర్, ఘోసి, జౌన్​పూర్, లాల్​గంజ్ సీట్లలో విజయం సాధించింది. ఇక మెయిన్​పురి, ఆజంగఢ్ సెగ్మెంట్లలో ఎస్పీ అగ్ర నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ విజయం సాధించారు.