ఎవరీ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశా తిలక్.. ఎవరీ బీఎన్ సదాలక్ష్మీ..?

ఎవరీ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశా తిలక్.. ఎవరీ బీఎన్ సదాలక్ష్మీ..?

కంటోన్మెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశ తిలక్ పేరును ఖరారు చేసింది ఆ పార్టీ అధినాయకత్వం. ఇవాళ తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబందించి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసింది.  ఎంబీబీఎస్ పూర్తి  చేసి వైద్యుడిగా స్థిరపడ్డ వంశ తిలక్ మొదటి డిప్యూటీ స్పీకర్ టీఎన్ సదాలక్ష్మి కుమారుడు. పూర్వ నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా సదాలక్ష్మి సేవలందించారు.  ఆమె కాంగ్రెస్ డెమోక్రసీ (బాబు జగ్జీవన్ రాం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ సేవలందించారు.  ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు.  

ఆమె తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ సేవలందించారు.  వంశ తిలక్ తండ్రి టీవీ నారాయణ స్వాతంత్ర్య సమర యోధుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఏపీపీఎస్సీ సభ్యుడిగానూ సేవలందించారు.  ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు.  వంశ తిలక్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ ఎన్నికల్లో తన పొలిటికల్ కెరీర్ ను డిసైడ్ చేసుకోనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా.. ఉప ఎన్నిక అభ్యర్ధి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసింది. ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ ను అధిష్టానానికి పంపగా వంశ తిలక్ పేరును ఫైనల్ చేసింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిన కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి అయిన నివేదితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. 

 గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు.  కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తేలిపోయారు. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కంటోన్మెంట్ బీజేపీ టికెట్ కోసం ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. మాదిగలకే అవకాశం ఇవ్వాలని మంద కృష్ణ పట్టుబట్టడంతో వంశ తిలక్ కు జాతీయ నాయకత్వం టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ టికెట్ కోసం ముగ్గురి పేర్లను స్టేట్ కమిటీ జాతీయ నాయకత్వానికి పంపింది. ఇందులో కొప్పుబాషా, వంశతిలక్, ఓం ప్రకాశ్ ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 32% ఓట్లు సాధించి బీజేపీ రెండో  స్థానంలో నిలిచింది. ఈ సారి కంటోన్మెంట్ పై జెండా ఎగురవేయాలని ఆ పార్టీ భావిస్తున్నది