రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం

రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
  • కాంగ్రెస్​ అమలు చేయలేని హామీలిచ్చింది: లక్ష్మణ్
  • బీఆర్ఎస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు 
  • ఆ పార్టీ కాంగ్రెస్​లో విలీనమవుతుందని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేని హామీలు ఇచ్చారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకపోతే, ఆగస్టు సంక్షోభం తప్పదని కామెంట్ చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.

 ‘‘ఫేక్ వీడియో తయారు చేసిన రేవంత్ రెడ్డి.. ఫేక్ సీఎం. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని రాహుల్ గాంధీ, రేవంత్ తప్పుడు ప్రచారం చేసినా జనం నమ్మలేదు. ఈసారి బీజేపీకి 370, ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయి” అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ‘‘సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను, దేవుళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే రూ.16 వేల కోట్లు అప్పు చేసింది.

రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి కేసీఆర్ చిప్ప చేతికిచ్చిపోయారు. ఇప్పుడు ఆ చిప్ప పట్టుకుని రేవంత్  తిరుగుతున్నారు. కేంద్రం రూ.16 వేల కోట్ల అప్పు ఇవ్వకపోతే, ఈ ఐదు నెలల పాలన కూడా గగనమయ్యేది” అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా, ఖజానాపై భారం పడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు, నీటి కొరత మొదలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు.  

బీఆర్ఎస్ చచ్చిన పాము  

బీఆర్ఎస్ చచ్చిన పాములా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. గ్యారేజ్ నుంచి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని, భవిష్యత్తులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమని కామెంట్ చేశారు.  ‘‘తెలంగాణ వచ్చినప్పుడే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు. అప్పుడు కుటుంబంతో కలిసి సోనియా గాంధీని కలిశారు. కానీ అధికార దాహంతో కలపలేదు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకున్నాయి” అని ఆరోపించారు.