బీజేపీ ఒడిశా ఇన్ చార్జ్ పురందేశ్వరి, కర్ణాటక సహ ఇన్ చార్జ్ డీకే అరుణ

బీజేపీ ఒడిశా ఇన్ చార్జ్ పురందేశ్వరి, కర్ణాటక సహ ఇన్ చార్జ్ డీకే అరుణ

బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జీలను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రాల ఇంచార్జీల పేర్లను ప్రకటించారు.

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకూ బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జీగా నియమించారు. కర్ణాటక సహ ఇన్‌చార్జ్‌గా డీకే.అరుణకు బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్‌ సహ ఇన్‌చార్జ్‌, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్‌‌ను నియమించింది. మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌గా మురళీధరరావును నియమించింది. తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.

ప్రధానంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే… ఏపీ, తెలంగాణకు కీలక నేతలను ఇంచార్జీలుగా నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి ఇంచార్జీగా మురళీధరన్‌ను నియమించింది. వి. మురళీధరన్‌ కేరళకు చెందిన నేత, ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఏపీ ప్రస్తుత ఇంచార్జీ సునీల్‌ దియోధర్‌కు సహ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది.

తెలంగాణ పార్టీ బాధ్యతలను తరుణ్‌చుగ్‌కు అప్పగించింది. తరుణ్‌చుగ్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాదు.. బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమానికి జాతీయ సహ సమన్వయకర్తగానూ కొనసాగుతున్నారు. తరుణ్‌చుగ్‌కు జమ్మూకశ్మీర్‌, లేహ్‌ ఇంచార్జీ బాధ్యతలను కొనసాగిస్తూనే తెలంగాణ బాధ్యతలనూ అప్పగించారు.