
- బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఆమోదించేలా కేంద్రంతో పోరాడాలి
- లేకుంటే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మిగతా నేతలు రాజీనామా చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
నిజామాబాద్, వెలుగు: సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తెచ్చే బిల్లుకు అడ్డుపడుతుందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్పంపిన బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వకుండా గవర్నర్ కేంద్రానికి పంపారని పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ సిటీలో ఆయన జిల్లా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
కేంద్రం వద్దకు వెళ్లిన బీసీ బిల్లుపై ఒత్తిడి తెచ్చి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ఆమోదించేలా చూడాలని సూచించారు. అలా చేయలేదంటే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇతర అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతాయన్నారు. ఇందుకు బీజేపీయేతర పార్టీలు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అంబేద్కర్రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదాన్ని రక్షించుకునేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మతోన్మాద రాజకీయాలు చేయడం తప్ప బీజేపీ చేసేదేమీలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చే రెండు నెలలు పల్లె, పట్టణ వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరులో వెనక్కిపోమని స్పష్టంచేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోమన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.రమణ, వెంకట్రాములు, ప్రసాద్, నూర్జహాన్, రమేశ్‌బాబు, రమేశ్తదితరులు ఉన్నారు.