ప్రాజెక్టులపై బీజేపీ పోరుబాట

ప్రాజెక్టులపై బీజేపీ పోరుబాట

హైదరాబాద్, వెలుగు‘‘కృష్ణా జలాల విషయంలో కొన్నేండ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. సీఎం కేసీఆర్ చేతగానితనమే దీనికి కారణం. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య లోపాయికారీ ఒప్పందం వల్లే కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ వాడుకోలేకపోతోంది. నదీ జలాల వాడకం విషయంలో టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి”అని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కృష్టా నదీ జలాల నీటి వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​లో ఏపీ కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది. కృష్ణా జలాల వాడకం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిపుణులు, నాయకులు పలు సూచనలు చేశారు. కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

నీటి హక్కుల విషయంలో అన్యాయం: కిషన్​రెడ్డి

సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ పోరాడుతుందని, ప్రాజెక్టుల విషయంలో సమగ్రంగా చర్చించి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి’ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర శాఖ చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు.

దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం

పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు వల్ల మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పాత ప్రాజెక్టులేవీ ఉండొద్దనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఏపీ తీసుకొచ్చిన జీవోతో జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. —కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న డిండి ప్రాజెక్టుకు నీరు రావడం కలగానే మిగిలిపోనుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎంపీ అర్వింద్, పార్టీ మాజీ చీఫ్​లు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్,  మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.

రీడిజైన్ల పేరుతో దోచుకుతింటున్నరు: జి.వివేక్

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ సర్కార్ రీడిజైన్ల పేరుతో దోచుకుతింటోందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ జి.వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కారు దందాలు, కుంభకోణాలు అన్నీఇన్నీ కావన్నారు. కృష్ణా నీటిని ఎలా వాడుకోవాలనే దానికన్నా.. ఈ నీటి పేరుతో ఎలా దోచుకోవాలనే ఆసక్తే కేసీఆర్ కు ఎక్కువని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి, తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూడింటినీ కేసీఆర్ పాతర వేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్.. కుటుంబ పాలన తీసుకువచ్చారని, ఈ ఆరేండ్లలో తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ప్రజలను మభ్యపెడుతూ, వాస్తవాలను కప్పిపుచ్చుతూ, అవాస్తవాలతో అధికారంలో కొనసాగుతున్నారని వివేక్ విమర్శించారు. ప్రజలు కేసీఆర్ నిజ స్వరూపాన్ని గుర్తిస్తున్నారని, త్వరలోనే ఆయనకు తగిన బుద్ధి చెపుతారని వివేక్​ హెచ్చరించారు.

తెలంగాణలో 88కి పెరిగిన కరోనా మరణాలు