రాష్ట్రంలో బలపడేందుకు ఇదే మోకా: అమిత్​ షా

రాష్ట్రంలో బలపడేందుకు ఇదే మోకా: అమిత్​ షా
  • నేనే స్పెషల్​ ఫోకస్​ పెడుతా
  • తరచుగా రాష్ట్రానికి వస్తా.. సభలు పెడుతా
  • ప్రతి నెలా కేంద్ర మంత్రులు కూడా వస్తారు
  • 2023లో అధికారమే లక్ష్యంగా ముందుకు కదలండి
  • రాష్ట్ర బీజేపీ నేతలతో పార్టీ చీఫ్​
  • 6న పార్టీ సభ్యత్వం కోసం రాష్ట్రానికి వస్తానని వెల్లడి
  • ఢిల్లీలో భేటీ అయిన రాష్ట్ర బీజేపీ కోర్​ కమిటీ
  • టీఆర్​ఎస్​ను ఎదుర్కోవాలని నిర్ణయం
  • మున్సిపల్​, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చ
  • ప్రజా ఉద్యమాలు చెపడుతాం: లక్ష్మణ్​

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఇదే మంచి అవకాశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా అన్నారు. ఆ దిశగా ముందుకు కదలాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తాను జులై 6 న సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం రాష్ట్రానికి వస్తానని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ చీఫ్​ అమిత్​షా, వర్కింగ్​ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో అమిత్​ షా మాట్లాడుతూ.. 2023లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నేతలంతా కార్యకర్తలతో కలిసి జనంలోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంపై తానే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విరివిగా సభలు, సమావేశాల్లో పాల్గొంటానని అమిత్​ షా తెలిపారు. అంతేకాకుండా ప్రతినెలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటనలు ఉంటాయని చెప్పారు. తెలంగాణలోని కుటుంబ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఇదే బలపడటానికి బీజేపీకి మంచి అవకాశమని పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఎలా విజయం సాధించామో, అదే టీం వర్క్​తో ముందుకు వెళ్తే ప్రజలు ఆదరిస్తారని రాష్ట్ర నేతలకు ఆయన సూచించారు.

కేసీఆర్​ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు అందడం లేదని, ఈ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో గెలుపు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతుందని, ఆ దిశగా ముందుకు సాగాలని అన్నారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం  సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో, కొత్తగా పార్టీలో చేరిన నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

టీఆర్​ఎస్​ ఆగడాలను ఎదిరిస్తాం: లక్ష్మణ్​

బీజేపీ కేంద్ర న్యాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలవడాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు అసహనంతో తమ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కోర్​ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, పార్టీని ఎదగకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్  ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్​ఎస్​ ఆగడాలను రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై సమావేశంలో చర్చించినట్లు  తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు, ధర్నాలు చేపట్టాలని  నిర్ణయం తీసుకున్నట్లు లక్ష్మణ్​ వెల్లడించారు. రాబోయే మున్సిపల్, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో, హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో  పార్టీ ఏవిధంగా ముందడుగు వెయ్యాలనే దానిపై చర్చించామన్నారు. ఆగస్టు నుంచి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఇస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో హింసా రాజకీయాలు

సీఎం కేసీఆర్ కూతురు ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్​ఎస్​ నేతలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, హింసా రాజకీయలకు పాల్పడుతున్నారని  లక్ష్మణ్​ అన్నారు. ఆసిఫాబాద్​ జిల్లాలో టీఆర్ఎస్​ ఎమ్మెల్యే సోదరుడు మహిళా ఉద్యోగిపై దాడి చేయడం దుర్మార్గమని,  సభ్యసమాజం తలదించుకూనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సోదరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరగపడుతారని ఆయన హెచ్చరించారు.

6న అమిత్​ షా రాక

దేశవ్యాప్తంగా జులై 6 నుంచి పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వనమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని లక్ష్మణ్​ చెప్పారు. మొదటిరోజు ప్రధాని మోడీ  వారణాసి నుంచి పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు తెలంగాణలో పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా వస్తారని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని శంషాబాద్ లోని కేఎల్​సీసీ ఫంక్షన్​ హాల్​లో  ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీకి ఉన్న సభ్యత్వానికన్నా అదనంగా 12 లక్షల మంది కొత్తవారిని చేర్చుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదులో యువకులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాలవారిని చేర్చుకోవాలని సమావేశంలో అమిత్ షా సూచించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వియోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని నిలదీశారు. దీన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 17 న రాష్ట్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానిస్తామని తెలిపారు.