- భూసేకరణ లేట్ చేసి పనులను పట్టించుకోలే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ మాత్రమే కారణం కాదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అందుకు కారణమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల హైవేపై చాలా మలుపులు ఉన్నాయని, దీన్ని నిజాం కాలంలో నిర్మించారని, ఇప్పటిదాకా ఎవరూ మరమ్మతు చేయలేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2016లోనే గెజిట్ ద్వారా ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించినప్పటికీ, బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. రూట్లో కొన్ని మార్పులు చేస్తే 11 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని, ప్రమాదాలు నివారించొచ్చని చెప్పారు. అన్ని తప్పులు చేసిన బీఆర్‌ఎస్ నాయకులే.. ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవేల నిర్మాణం కేంద్రం బాధ్యత కాగా, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు.
