- తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన
- ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలను ఎత్తివేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై ఓవైపు పత్తి రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీలలో అలాట్‌మెంట్, యాప్ రిజిస్ట్రేషన్, తేమ శాతం పరిమితి వంటి నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకో కొత్త రూల్ తీసుకువచ్చి పరేషాన్ చేస్తున్న సీసీఐ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ఎల్-1, ఎల్-2, ఎల్3 కేటగిరీలను ఎత్తివేయాలని, యాప్ రిజిస్ట్రేషన్ వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తోంది.
రోజుకో నిబంధనతో రైతులకు నష్టం
ఇటీవలి నిర్ణయాల ప్రకారం, ఎకరాకు ఏడు క్వింటాళ్లకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించింది. గత సీజన్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి.. ఈసారి ఐదు క్వింటాళ్లు తగ్గించడం రైతుల్లో ఆగ్రహం రేపింది. పైగా, పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం కంటే ఎక్కువ ఉంటే కొనమని సీసీఐ స్పష్టం చేయడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
అలాగే, సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. కానీ, గ్రామీణ రైతులలో చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేవు. అందువల్ల యాప్‌లో నమోదు చేయలేకపోతున్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6 వేలకు పడిపోగా.. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు పూర్తిగా చిక్కుముడిలో పడ్డారు.
మిల్లుల ఉనికిని సవాల్ చేయడమే సీసీఐ ఉద్దేశం..
జిన్నింగ్ మిల్లుల వ్యవస్థను ధ్వంసం చేయడానికే కేంద్రం కొత్త విధానాలను తెచ్చింది. ఎల్–1, ఎల్–2, ఎల్–3 విధానాలు పూర్తిగా అన్యాయమైనవి. ఈ తీరు ఇలాగే కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉంది. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా, లెటర్లు రాసినా సీసీఐ పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలోనే మిల్లులు బంద్ చేయక తప్పడం లేదు.
- రవీందర్ రెడ్డి, కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
