ఫిడే వరల్డ్ కప్‌‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్ శుభారంభం

ఫిడే వరల్డ్  కప్‌‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్ శుభారంభం

పనాజి: సొంతగడ్డపై ఫిడే వరల్డ్  కప్‌‌లో ఫేవరెట్‌‌  తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. నేరుగా రెండో రౌండ్‌‌లో బరిలోకి దిగిన అర్జున్ మంగళవారం జరిగిన తొలి గేమ్‌‌లో నల్లపావులతో ఆడి విజయం సాధించాడు.   బల్గేరియాకు చెందిన మార్టిన్ పెట్రోవ్‌‌కు అర్జున్ 37 ఎత్తుల్లో చెక్ పెట్టగా.. వరల్డ్ జూనియర్ చాంపియన్ వి.  ప్రణవ్ నార్వేకు చెందిన జీఎం ఆర్యన్ తారిపై 41 ఎత్తుల్లో గెలిచాడు. 

అయితే, సీనియర్  ప్లేయర్ విదిత్ గుజరాతీను ఈ టోర్నీలో ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్, 12 ఏండ్ల  ఫౌస్టినో ఒరో (అర్జెంటీనా) ఇబ్బంది పెట్టాడు. ఓ దశలో ఓటమి దిశగా వెళ్లిన విదిత్ 28 ఎత్తుల్లో గేమ్‌‌ను డ్రాగా ముగించగలిగాడు. వరల్డ్ చాంప్‌‌ డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, పి. హరికృష్ణ కూడా తమ ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు.